Wednesday 22 May 2013

ఐపీఎల్... ఫిక్సింగ్ ల గోలలో మనకు కనిపిస్తున్నదీ... వినిపిస్తున్నదీ చాలా తక్కువ. ఈ స్వల్పానికే మనం గుండెలు బాదేసుకుంటున్నాం. నిజానికి తెలియంది ఎంతో ఎక్కువ. అది బయటకు రాకుండా అడ్డుకునే శక్తులెన్నో.   అసలైన దోషి ఎవరు... మూలాలెక్కడున్నాయో, పరిష్కారాలేంటో సూచిస్తూ ఈనాడులో ఈరోజు నేను రాసిన కథనం ఇది....




ఐపీఎల్... ఫిక్సింగ్ ల గోలలో మనకు కనిపిస్తున్నదీ... వినిపిస్తున్నదీ చాలా తక్కువ. ఈ స్వల్పానికే మనం గుండెలు బాదేసుకుంటున్నాం. నిజానికి తెలియంది ఎంతో ఎక్కువ. అది బయటకు రాకుండా అడ్డుకునే శక్తులెన్నో.   అసలైన దోషి ఎవరు... మూలాలెక్కడున్నాయో, పరిష్కారాలేంటో సూచిస్తూ ఈనాడులో ఈరోజు నేను రాసిన కథనం ఇది....




Friday 15 March 2013

దేవుడ్ని మర్చిపోదామిక.. పుస్తక పరిచయం





నేనే రాసిన పుస్తకం ‘దేవుణ్ణి మరచిపోదామిక’ - FORGET THE GOD REMEMBER SACHIN పై http://pustakam.net/?p=14238 లో యశస్వి సతీశ్ గారురాసిన సమీక్ష ఇది. ధన్యవాదాలు సతీశ్ గారు.













దేవుడ్ని మర్చిపోదామిక : ఈ పుస్తకం చదవడం పూర్తిచెయ్యగానే.. ఆలోచనలనుంచి

బయటపడడం కష్టమైంది.


ఎప్పుడో చదివిన  విషయం గుర్తుకువచ్చింది.

డిసెంబరు 9, 1979 న అమెరికా లోని ఉత్తర ఫ్లోరిడా రాష్ట్రంలో ఒక రోడ్డు ప్రమాదం
జరిగిందట. ఓ తల్లి కళ్ళెదుటే తన 18 ఏళ్ళ బిడ్డను రోడ్డు ప్రమాదంలో
కోల్పోయింది.  19 ఏళ్ళ డ్రైవర్ తాగిన మైకంలో కారుతో గుద్ది చావుకు
కారణమయ్యాడు. ఆమె పేరు Beckie Brown  తన కడుపుకోత వేదనను క్రోధంగా, కన్నీటిగా
జార్చలేదు ఆ తల్లి. తాగి వాహనం నడిపే చర్యకు వ్యతిరేకంగా ఒక సంస్థను
నెలకొల్పింది. అదే MADD (Mothers Against Drunk Driving) ప్రభుత్వం మీద,
వ్యవస్థలో లోపాల మీద, తాగుబోతు ల మీద ఒకరకంగా యుధ్ధం ప్రకటించింది. ఆమె కారణం
గా చట్టాలు మారాయి. మరెన్నో విజయాలతో పాటు ఇప్పటివరకూ 3 లక్షల మంది ప్రాణాలు
కాపాడిన ఘనత  సొంతం చేసుకుంది. ఎంతగొప్పవిషయం ఇది.. ఒక సాధారణ తల్లి కే ఇంత
విజయం సాధ్యమైతే.. అందరం ఆశ్చర్యపోతాం. మెచ్చుకుంటాం.. వీలైతే చేయందిస్తాం..
అదేకదా జీవన సాఫల్యత! మనిషిలో మనిషిని దర్శించడం అంటే అదే..

రేగళ్ళ సంతోష్ కుమార్   అనే ఆటల సంపాదకుడు (అదేనండీ ..ఈనాడు క్రీడా విభాగపు
రౌతు)  తన కింత కాలం చేతి నిండా పని కల్పించిన సచిన్ టెండుల్కర్ అనే పందెపు
గుర్రాన్ని  పాల కడలిలో అంజనం వేసి చూపించేశాడు

మేమంతా మీ ’ఆవు’ అని ఆటపట్టించినా.. ఆట కోసమే కదా అని ఇన్నాళూ ఊరుకొని ఈరోజు
నిజంగా సచిన్ కామధేనువే కాదు, కల్పవృక్షమూ ఐరావతమూ, ఉఛ్ఛైశ్వమూ అని చూపడానికి,
ఉదాహరణలతో తెలుపడానికీ సాహసం కావాల్సిందే. అదేమాట అడిగి చూడండి సంతోష్ ని..  పుట్
బాల్ లో పీలే , మారడోనా కలిస్తే .. క్రికెట్లో సచిన్ అని అలెన్ డోనాల్డ్
అనగాలేనిది నా మాట ఎంత!! అని తేటతెల్లం చేస్తాడు. ఆకతాయి సచిన్నోడి కసిని
అన్నయ్య  అజిత్ కృషిగా మరల్చడంలో ఓ రాయేశాడని సెలవిచ్చేస్తాడు.

నిజమే ప్రవాహానికి ఆనకట్ట కట్టడంలోనే మనిషి గొప్పదనముంది. అది Beckie Brown
ఐనా, సచిన్ టెండుల్కర్ ఐనా..

ఒక యోధుడి వ్యక్తిత్వ ఆవిష్కరణ ఈ పుస్తకంలో కనిపిస్తుంది. క్రికెట్ మైదానానికి
అవతలవైపునే రచయిత ఫొకస్. ముందు మాటలో వెరీవెరీ స్పెషల్ లక్ష్మణ్ చెప్పినట్టు..
ఒక మనిషిని దేవుడిలా అభిమానించే స్థాయికి దోహదం చేసిన అసక్తికర అంశాల సమాహారం
ఈ.. ప్రయత్నం.

మైదానంలో వేల మంది తనను చూస్తున్నా, కోట్ల ఆశలను మోస్తూ ప్రపంచాన్ని తన
తన్మయత్వంలో ముంచి ఆడిన ఆట మనం ఇకముందు చూడలేకపోవచ్చు..అతడ్నెలా
గుర్తించుకోవాలి! అన్న మాటకు సమాధానమే  ఈ పుస్తకం.

ఎవరు సలహాలిచ్చినా సచిన్ నాలాగే వింటుంటాడట బ్రదర్!.. ఓ ఉద్యోగి తన సహచరుడితో
పరాచకాలు..

కోం ముహ్ ఖరాబ్ కర్ లే తేరే.. సచిన్ అక్తర్ తో అన్నట్టు ఓ బూతులాట గాడికి
క్ర్రీడాస్ఫూర్తి ఉన్నవాడి సలహా..

ఏపనికైనా సచిన్ 20 నిముషాలు ముందుంటాడట.. ఓ వ్యక్తిత్వ వికాస శిక్షకుడి
ఉదాహరణ..

తన వాచ్ మెన్ కొడుకు, చిన్నప్పటి స్నేహమేనంట.. పర్సనల్ అసిస్టెంట్.. తెలుగు
సినిమా పంచిన మంచిలోంచి సచిన్ ని కొలుస్తూ.. ఓ కాలేజీ కుర్రాడు..

ఇవన్నీ తెలిపేవి అతడో సెంచరీల వరద, రికార్డుల హోరు మాత్రమేకాదని, సచినంటే
వినయం.. నిగ్రహం.. నిరంతర సాధన.. నిత్య విజ్ఞానార్జన, మంచితనం..  అందుకే
పరుగుల దేవుణ్ని మర్చిపోయి సచిన్ ను గుర్తుంచుకుందాం అంటారు క్రీడా స్ఫూర్తి
తో రచయిత.



అరే.. నీకీ విషయం తెలుసా!.. చిన్నప్పుడు సచిన్ అందర్నీ కొట్టేవాడట.. కోపిష్ఠి
మెకన్రో ని ఆరాధించేవాడట..ఓ పిల్లవాడు తనలో సచిన్ ను చూసుకునే ప్రయత్నం..
తిరుగులేదు.. వీడు మనకొక ఆశాకిరణం. కావాల్సింది పట్టుదలే మనవాడికి.

“సచిన్ లా మెదటి మ్యాచ్ డకౌట్ కాదురా నేనూ..” సచిన్ ను దాటాలనే ఆశ.. వీడూ
గొప్పోడవుతాడు.. చదువులోనైనా.. ఆటలోనైనా..ఉద్యోగంలోనైనా.. జీవితం లోనైనా.. ఇది
నిజంగా ఛాంపియన్లను తయారుచేసే ప్రయత్నమే..

*సంతోష్ ది.. ఎంత స్వార్థం.. చిన్ని పుస్తకం **రాసేసి**.. పేపర్ల నిండా
విజయగాథలను చూడాలని కలగంటున్నాడు..*

ఒక్క తరమైనా సచిన్ లా పరిగెడితే.. కాదు .. కనీసం ఆలోచిస్తే.. మన దేశం నిస్తేజ
సాగరాన మునిగే బదులు.. ఉప్పొంగే జీవన తరంగాల వెల్లువై పులకించిపోదా!!

“నేనే కాదు..ఎవరూ పరిపూర్ణులు కారు.. కాలేరు నిరంతరం నేర్చుకోవాల్సిందే.” ఇవి
సచిన్ మాటలు గా స్వీకరిస్తే.. అక్షరాలు సిక్సర్లుగా మదిలో కి దూసుకుపోతాయి..
తిరిగి మనల్ని కష్టమైన బంతుల్ని ఎదుర్కోవడానికి సన్నద్ధం చేస్తాయి.



నూతనోత్తేజం కోరే ప్రతి మనిషి తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.

ఇది లోకానికి ఓ సంతోషపు ప్రేమ కానుక లా నాకనిపించింది



 పుస్తకం: దేవుణ్ని మర్చిపోదామిక… సచిన్ ను గుర్తుంచుకుందాం (forget the
God… remember
Sachin)

రచన: రేగళ్ళ సంతోష్ కుమార్

పేజీలు: 80

ప్రచురుణ: సహృదయ సంతోషం ఫౌండేషన్

ప్లాట్ నెం. 68, లయన్స్ టౌన్ కాలనీ, హస్మత్ పేట, ఓల్డ్ బోయినపల్లి,
సికిందరాబాదు- 500009

sahrudayasantosham@gmail.com

http://kinige.com/kbook.php?id=1558&name=Devunni+Marchipodaamika



 Yasaswi' సతీష్

www.blaagu.com/sateesh



 (తెల్లకాగితం..కవిత్వ సంపుటి  రచయిత)

Monday 11 March 2013

క్రికెట్ ‘వీర’ లేవరా!



'ఎంతటి ఆటగాడైనా తానాడే స్థానాన్ని బట్టి శైలిని, ఆటతీరును సర్దుబాటు చేసుకుంటాడు. కానీ వీరేంద్ర సెహ్వాగ్‌ మాత్రం...తన శైలిని కాకుండా ఆడే స్థానాన్నే పునర్‌ నిర్వచించాడు. అదే అతని గొప్పతనం.''
భారత 'మాజీ కోచ్‌ జాన్‌రైట్‌ ఇచ్చిన కితాబిది! జాన్‌రైటనే కాదు... క్రికెట్‌ తెలిసిన ఎవర్ని అడిగినా చెబుతారు సెహ్వాగ్‌ ఆటేంటో! శైలేంటో! తీరేంటో!

జట్టు పరిస్థితిని గమనిస్తాడో లేదో తెలియదు...బౌలర్‌ ఎవరన్నది పట్టించుకుంటాడో లేదో తెలియదు...బంతిని అర్థం చేసుకుంటాడో లేదో తెలియదు...



తనకు తెలిసిందల్లా ఒక్కటే పరుగు! తానైనా పరుగెత్తాలి... బంతినైనా పరుగెత్తించాలి! ఈ క్రమంలో బంతినైనా ఇంటికి (బౌండరీకి) పంపిస్తాడు... లేదంటే తానైనా ఇంటికొ(పెవిలియన్‌కు)చ్చేస్తాడు. కుదిరిందంటే అలరిస్తాడు.... లేదంటే అయ్యో అనిపిస్తాడు. అంతే తప్ప... పరుగుల కోసం ప్రణాళికలు రచించటం... వ్యూహాత్మకంగా ఆడటం ఉండదన్నట్లుంటాడు!
సెంచరీకి చేరువవగానే ఎంతటి ఆటగాడైనా మెల్లగా ఆడేసి... వంద పూర్తి చేయటానికి ప్రయత్నించటం సహజం! అలాంటిది... ఇప్పటిదాకా తన జట్టు చరిత్రలో ఎవ్వరూ చేయని ట్రిపుల్‌సెంచరీ ముంగిట నిలబడి సిక్స్‌ కొట్టాడంటే....దాన్ని ధైర్యమందామా? మొండితనమందామా? వన్డేల్లో తన గురువు (సచిన్‌) పేరిటున్న ప్రపంచ రికార్డును (200 పరుగులు) చెరిపేసే అవకాశం వచ్చిన క్షణాన ఫోర్‌ కొట్టాడంటే దాన్ని నిర్లక్ష్యమనాలా? నిర్భయమనాలా?
ఓసారి ఇంగ్లాండ్‌ కౌంటీల్లో లీసెస్టర్‌షైర్‌ తరఫున ఆడుతున్నాడు. ప్రత్యర్థి జట్టులో అబ్దుల్‌ రజాక్‌! పాకిస్థానీ తరహాలో రివర్స్‌ స్వింగ్‌ మొదలెట్టాడు. బ్యాట్స్‌మెన్‌కు ముఖ్యంగా... సెహ్వాగ్‌ సహచరుడికి ఇబ్బంది మొదలైంది. దీంతో సెహ్వాగ్‌ ఓ వ్యూహం రచించాడు. తర్వాతి బంతిని నేరుగా గ్రౌండ్‌ బయటపడేలా సిక్స్‌గా మలిచాడు. అంపైర్లకు కొత్త బంతి తీసుకోకతప్పలేదు. ''ఇక మరో గంట దాకా రివర్స్‌ స్వింగ్‌ భయం లేదు. పండగ చేసుకో'' అన్నాడు తన సహచరుడితో సెహ్వాగ్‌!

అందుకే... జాన్‌రైట్‌లాంటివాళ్ళు తెలివైన వాడని కితాబిస్తే... జెఫ్రీ బాయ్‌కాట్‌లాంటివాళ్ళకది తెలివైన మూర్ఖత్వంలా కనిపించింది! ఎవరేమనుకున్నా తన తీరుకు సెహ్వాగ్‌ పెట్టుకున్న పేరు సహజ శైలి! ఏమైతే అదవుతుంది... నా శైలి నాది అనే ఆ తత్వమే సెహ్వాగ్‌తో ఇన్నాళ్ళూ పరుగులు పెట్టించింది. ఇప్పుడు అదే కెరీర్‌కు ప్రమాదంగా పరిణమించింది కూడా!

నిజానికి.... వివ్‌ రిచర్డ్స్‌లోని విధ్వంసం... డేవిడ్‌ గ్రోవర్‌లోని శిల్పం... విశ్వనాథ్‌లోని విన్యాసం.... సచిన్‌లోని నైపుణ్యం... ఇన్నింటి కలబోత వీరేంద్ర సెహ్వాగ్‌! తనంతగా ఏ బౌలర్‌నూ ఏ క్షణంలోనూ లెక్కచేయకుండా... ధైర్యంగా ఆడిన మరో బ్యాట్స్‌మెన్‌ సమకాలీన క్రికెట్‌లో ఉండడంటే అతిశయోక్తికాదు.

ఏ ఆటగాడైనా ఒకసారి ఔటైనట్లుగా మరోసారి ఔట్‌కావాలని కోరుకోడు! తప్పులెక్కడ చేశానో చూసుకొని సర్దుకుంటాడు! కానీ వీరూ రూటే వేరు! తొలి ఇన్నింగ్స్‌లో ఔటైనట్లే రెండో ఇన్నింగ్స్‌లోనూ ఔటవుతాడు! సర్దుకోవటాలు... సరిదిద్దుకోవటాలు లేవన్నట్లు ఆడతాడు! అందుకే ఛాపెల్‌ లాంటివాళ్ళకు కొరుకుడు పడని కొయ్యగా మిగిలిపోయాడు! నిజానికి వీరూ విధ్వంసక ఇన్నింగ్స్‌లో చాలామటుకు ఆ ధోరణితో వచ్చినవే! అభిమానుల్ని మెప్పించినవే! వయసులో ఉన్నంత కాలం అది బాగానే నడిచింది! కానీ ఇప్పుడు... 36 దాటుతున్నాడు. శరీరకదలికల్లో... సమన్వయంలో తేడా వస్తుంది... వస్తోంది! ఇన్నాళ్ళు ఆడినట్లే ఇప్పుడూ ఆడతానంటే కుదరకపోవచ్చు. సర్దుబాట్లు తప్పకపోవచ్చు. సచినంతటివాడే శరీరం సహకరించక కొన్ని షాట్లను అస్త్రసన్యాసం చేసేశాడు. ఆటతీరును మార్చుకున్నాడు. వీరూ చేయాల్సిందల్లా ఇప్పుడు మానసికంగా మారటమే! శరీర ధర్మాన్ని అనుసరించి సర్దుకోవటానికి సిద్ధపడటమే! ఆ నిర్ణయం తీసుకోవటానికి వీరూ సిద్ధపడతాడా? లేదా? అనేదే ఆసక్తికరం!

అభిమానుల్ని అలరించిన అద్భుత బ్యాట్స్‌మన్‌ కెరీర్‌ ఇలా ముగియాలని ఏ అభిమానిగానీ... అంతెందుకు సెహ్వాగ్‌ బారిన పడ్డ ఏ ప్రత్యర్థి బౌలర్‌గానీ కోరుకోడు!
అభిమానుల్ని అలరించిన అద్భుత బ్యాట్స్‌మన్‌ కెరీర్‌ ఇలా ముగియాలని ఏ అభిమానిగానీ... అంతెందుకు సెహ్వాగ్‌ బారిన పడ్డ ఏ ప్రత్యర్థి బౌలర్‌గానీ కోరుకోడు! చివరకు సెహ్వాగ్‌ కూడా! గతంలో ఓసారి ''మీకూ సచిన్‌కు తేడా ఏంటంటే...'' - ''బ్యాంక్‌ బ్యాలెన్స్‌'' అని ఓసారి బదులిచ్చాడు వీరూ! నాడు పరాచికానికే ఆ మాట అన్నప్పటికీ... ఇప్పుడు నిజంగానే తన గురువుకూ తనకూ ఉన్న తేడా అదేనని నిరూపించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది! అంటే... గడ్డుకాలాన్ని దాటి మళ్ళీ పరుగులెత్తించే సత్తా తనలో ఉందని నిరూపించుకోవాలిప్పుడు! అలా మళ్ళీ సిద్ధమైన తర్వాత... ఓపెనింగ్‌ కాకుంటే నాలుగోస్థానంలో దిగొచ్చేమో! ఎలాగూ తొలినాళ్ళలో తన స్థానమదే! బహుశా మొదలెట్టిన చోటే ముగించే అవకాశం దొరుకుతుందేమో!

అందుకే... 'వీరు'డా లే!

లోకమంతా క్యారమ్‌ బాల్‌ను చూసి కకావికలవుతున్న వేళ....
కాలు కదపకుండా సింహనాదం చేసి
అజంతా మెండిస్‌ అనే బౌలర్‌ను చరిత్రలో కలిపేసిన క్షణాల్ని గుర్తుకు తెచ్చుకో!

తాండవాలు చేయకుండా....
తారంగంలా చేతులూపి....బ్యాట్‌ తిప్పి... ట్రిపుల్‌ సెంచరీతో
పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపించిన ముల్తాన్‌ క్షణాల్ని స్మరించుకో!

శ్రీలంకతో మ్యాచ్‌లో జట్టు జట్టంతా 329 చేస్తే...
అందులో నీవొక్కడివే 201 చేశావని జ్ఞాపకం చేసుకో!

చెన్నైలో దక్షిణాఫ్రికాపై...
ఒక్కరోజులోనే 257 పరుగులు చేశావనీ...
304 బంతుల్లోనే 319 సాధించావనీ..
ఇప్పటికీ నీ స్త్ట్రెక్‌రేట్‌ 82.33 అనీ...
గుటక వేసినంత సులభంగా ఫోర్లు కొట్టగలవనీ...
నీళ్ళు తాగినంత అలవోకగా సిక్స్‌లు బాదగలవనీ...
ఏటీఎంలో డబ్బులు తీసినంత సులువుగా సెంచరీలు చేయగలవనీ..
ఒక్కసారి మననం చేసుకో....!!

ఘనంగా ముగించు... జనంలో ముగించు!



( మార్చి 9, శనివారం, 2013న ఈనాడులోప్రచురితమైన నా కథనం ఇది)  

Saturday 9 March 2013

ఆలస్యం అంత విషమా?





ఎగ్జామ్ మొదలైన 15 నిమిషాల తర్వాత వస్తే అనుమతించం...

పరీక్ష హాల్లోకి నిమిషం ఆలస్యంగా వచ్చినా వాపస్ వెళ్ళాల్సిందే.

సమయం ముంచుకొస్తుండటంతో పరుగెత్తుతున్న విద్యార్థులు...

సమయానికి చేరుకోలేక పోయానని దిగులుతో ఏడుస్తున్న విద్యార్థిని...

అనుమతించాలంటూ ప్రిన్సిపాల్ ను వేడుకొంటున్న విద్యార్థులు....

పరీక్షల వేళయిందంటే చాలు  ఇలాంటి ప్రకటనలు... వార్తలు... తరచూ కనిపిస్తుంటాయి.

అదే సమయంలో

చీకట్లో పరీక్ష రాస్తున్న విద్యార్థులు...

క్యాండిల్ వెలుతురులో పరీక్ష రాస్తున్న విద్యార్థులు...

బెంచీలు లేక వరండాలో కింద కూర్చొని పరీక్ష రాస్తున్న విద్యార్థులు....

ఇవీ కనిపిస్తాయి పత్రికల్లో....

ఇవి కనిపించినప్పుడల్లా ఒక ప్రశ్న తొలుస్తుంటుంది....

కనీస సౌకర్యాలు కల్పించలేని వాళ్ళు....

విద్యార్థులకు మాత్రం కచ్చితంగా ఒక నిమిషం, 15 నిమిషాలంటూ ఎందుకు క్రమశిక్షణ విధించాలని

చూస్తారు?

అసలు పరీక్ష కేంద్రానికి విద్యార్థులు ఆలస్యంగా వస్తే వచ్చే నష్టం ఎవరికి?

విద్యార్థులకా? ప్రభుత్వానికా?

పరీక్ష కేంద్రాలకు చేరుకోవటానికి సరైన రవాణా సదుపాయాలుండవు...
చేరుకున్నాక... కూడా సదుపాయాలు సమకూర్చలేరు. పరీక్ష పేపర్లు కూడా తప్పులులేకుండా

తయారు చేయలేరు... కానీ... అదేంటో... విద్యార్థులను మాత్రం పరుగులెత్తిస్తారు. టెన్షన్

పెడతారు.. ఏడిపిస్తారు....


ట్రాఫిక్ జామో... అనుకోని అవాంతరమో ... కారణం ఏదైనా కావొచ్చు... ఆలస్యం కావటానికి!
ఒక్క నిమిషం ఆలస్యమైందని ఏడాది చదువును నాశనం చేయటం ఏం న్యాయం?
ఆలస్యమైతే నష్టపోయేది విద్యార్థే. అన్ని ప్రశ్నలకు సమాధానం రాయటానికి సమయం సరిపోక

ఇబ్బంది పడేది విద్యార్థేగాని నిర్వాహకులు కాదే!

కావాలంటే పరీక్ష పూర్తయ్యే దాకా హాల్ లోంచి బయటకు వెళ్ళనీయమని నిబంధన పెట్టడాన్ని

కొంతమేరకు అర్థం చేసుకోవచ్చు. కానీ నిమిషం దాటితే రానివ్వకపోవటంలో కారణం మాత్రం

విచిత్రం.

క్రమశిక్షణ పాటించటం బాగానే ఉంటుంది. కానీ అది జీవితాన్ని నిలబెట్టడానికి సాయపడాలే తప్ప కూల్చటానికి కాదు.